శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రెండు చోట్ల జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలలో ఒక వ్యక్తితోపాటు పోలీస్ అధికారి మరణించారు. శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు రౌఫ్ అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. క్షతగాత్రుడిని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నవకడల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కశ్మీర్ జోన్ పోలీస్ అధికారి తెలిపారు.
మరో ఘటనలో అనంతనాగ్‌లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్‌పై గన్ పైర్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.