శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. (terrorist attack) ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం బెహిబాగ్ ప్రాంతంలో మాజీ సైనికుడు మంజూర్ అహ్మద్ వాగే, ఆయన కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మంజూర్ అహ్మద్ వాగే, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఉగ్రవాదులు పొట్టలో కాల్చడంతో తీవ్రంగా గాయపడిన మంజూర్ అహ్మద్ చికిత్స పొందుతూ మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాళ్లకు బుల్లెట్ గాయాలైన ఆయన భార్య, కుమార్తె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.
మరోవైపు పోలీసులు, పారామిలిటరీ దళాలు, ఆర్మీతో కూడిన సంయుక్త బృందం వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీకి చెందిన ఒక సైనికుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. జలూరా గుజ్జర్పతిలో దాక్కున్న ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో గాయపడిన ఆ జవాన్‌ను కాల్పుల స్థలం నుంచి తరలిస్తుండగా చనిపోయినట్లు పేర్కొన్నారు.