ముంబై: భారత భద్రతా బలగాలు ఈ ఏడాది ఘన విజయం సాధించాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లలో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరిని భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పేలుళ్లలో పాల్గొన్న భారతదేశానికి చెందిన టెర్రరిస్టులలో ఒకరైన అబూ బకర్‌ను భారత భద్రతా దళాలు అరెస్టు చేశాయి. యూఏఈ ఏజెన్సీల సహకారంతో ఈయన అరెస్టు జరిగినట్లు సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, త్వరలో అబూ బకర్‌ను భారతదేశానికి తీసుకురానున్నారు.
అబూ బకర్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడు. అతడి అరెస్ట్ కోసం చాలా కాలంగా ఆపరేషన్ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా అతడు పాకిస్తాన్, యూఏఈలో తలదాచుకున్నట్లు సమాచారం. 1993లో ముంబైలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. ఈ వరుస పేలుళ్లలో అబూ బకర్ కూడా పాత్రధారిగా భారత విచారణ ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి.
అరెస్టైన ఉగ్రవాది అబూ బకర్.. పీఓకేలో ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణతో పాటు ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను పేల్చడంలో దిట్టగా మారాడు. ఇంతకుముందు అబూ బకర్‌ను 2019 లోనే అరెస్టు చేశారు. అయితే కొన్ని పత్రాలను సమర్పించని కారణంగా యూఏఈ అధికారులు అతడ్ని విడుదల చేశారు. అబ్దుల్ గఫూర్ షేక్, ముస్తాఫా దోసాతో కలిసి పలు స్మగ్లింగ్ కేసుల్లో కూడా పాల్గొన్నాడు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి బంగారం, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్మగ్లింగ్ చేసేవాడు. ఇతడిపై 1997 లో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అప్పటి నుంచి భారత విచారణ ఏజెన్సీలు అబూ బకర్ కోసం గాలిస్తున్నాయి. అబూ బకర్‌ను దాదాపు 29 సంవత్సరాల తర్వాత యూఏఈ నుంచి భారత్‌కు తీసుకురానున్నారు.