న్యూఢిల్లీ, జూలై 18: రైలు నిబంధనలు, అధికారిక పరిభాషలో ‘సెకండ్ క్లాస్ ప్రయాణికుడు’ అనే పదాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ‘సెకండ్ క్లాస్’ అనేది రైలు బోగీకి వర్తిస్తుందని, అందులో ప్రయాణించే వ్యక్తికి కాదని స్పష్టం చేసింది. రైలు ప్రమాదంలో ఓ ప్రయాణికుడు చనిపోగా, బాధిత కుటుంబానికి పరిహారం చెల్లింపునకు సంబంధించి కేసు విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. భారతీయ రైల్వే ఇకపై ‘రెండవ తరగతి ప్రయాణికుడు’ అనే పదాన్ని వాడరాదని సుప్రీంకోర్టు సూచించింది. ప్రయాణికులను ఈ విధంగా వర్గీకరించటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం పేర్కొన్నది. మధ్యప్రదేశ్ హైకోర్టు, రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
మరణించిన వ్యక్తి వద్ద టికెట్ లేనంత మాత్రాన పరిహారం నిరాకరించరాదని కోర్టు పేర్కొన్నది. కదులుతున్న రైళ్లను ఎక్కడం, తెరచి ఉన్న ద్వారాల వద్ద నిలబడి ప్రయాణించటం, రద్దీగా ఉన్న రైళ్ల నుంచి ప్రయాణికులు కింద పడిపోతున్న ఘటనల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పదేండ్ల క్రితం (2015) మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రకాంత్ ఠక్కర్ రాయ్‌పూర్ నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణిస్తుండగా, అహ్మదాబాద్-హౌరా మెయిల్ రైలు నుంచి కిందపడి మరణించాడు. ఘటన అనంతరం అతడి రైలు టికెట్ ఉన్న బ్యాగ్ కనిపించకుండా పోయింది. టికెట్ లభ్యం కాకపోవడంతో ఠక్కర్ నిజమైన ప్రయాణికుడు కాదంటూ రైల్వే ట్రిబ్యునల్, ఎంపీ హైకోర్టు పరిహారాన్ని నిరాకరించాయి.