చెన్నై: తమిళనాడు (Tamil Nadu) మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు సందర్శించి నివాళి అర్పించారు. అయితే విల్లిపుత్తూరు ఆలయం గోపురం ప్రతిరూపంతో కరుణానిధి స్మారక చిహ్నాన్ని అలంకరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వం హిందూ మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించింది.
కాగా, హిందూ పవిత్రతపై దాడి జరిగిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విమర్శించారు. మంత్రి శేఖర్ బాబు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దానిని తొలగించాలని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పిలుపునిచ్చారు. బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామలై కూడా డీఎంకేపై మండిపడ్డారు. హిందూ మతాన్ని అవమానిస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
మరోవైపు అధికార డీఎంకే ఈ చర్యను సమర్థించింది. 1949లో సీఎం ఒమండూరు రామసామి రెడ్డి హయాంలో అధికారికంగా స్వీకరించిన గుర్తులో ఈ ఆలయం గోపురం భాగమని తెలిపింది. రాష్ట్ర చిహ్నంలో అంతర్భాగమైన గోపురం ప్రతిరూపం తమిళ సంస్కృతి, నిర్మాణ వారసత్వానికి ప్రతీక అని గుర్తు చేసింది. దీనిని మతానికి ముడిపెట్టడం సరికాదని పేర్కొంది.