Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రాం సేవల్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు జస్టిస్ తేజాస్ కరియా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరపనుంది. వచ్చే ఆదివారం, జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీఎగ్జామ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రాం సేవల్ని తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
తాజాగా జరిగిన పేపర్ లీకేజీని సీబీఐ విచారిస్తోంది. గత నెలలో జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు పీడీఎఫ్‌ల రూపంలో పరీక్షకు ముందే లీకయ్యాయి. వాట్సాప్, టెలిగ్రాంలలో భారీగా షేర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టెలిగ్రాంపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీయే (ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కూడా స్వాగతించింది. ఐటీ యాక్ట్ 2020, సెక్షన్ 69 ప్రకారం ఈ నిషేధం విధించినట్లు తెలిపింది. టెలిగ్రాం యాప్‌లో నీట్ పేపర్ లీకేజీ కోసం కొన్ని గ్రూపులు పని చేస్తున్నాయని ఎన్టీయేతోపాటు కేంద్ర విద్యాశాఖ ప్రభుత్వానికి సూచించాయి. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా వెల్లడించాయి.
దీంతో మరోసారి లీక్‌కు అవకాశం ఇవ్వకూడదనే కారణంతో కేంద్రం ఈ యాప్‌పై నిషేధం విధించింది. అయితే, ఈ నిర్ణయాన్ని టెలిగ్రాం సంస్థ వ్యతిరేకిస్తోంది. వెంటనే నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రోజే దీనిపై విచారణ జరగనుంది. టెలిగ్రాం యాప్‌పై కేంద్రం విధించిన నిషేధం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ప్లేస్టోర్, యాపిల్ ఐఓఎస్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో లేదు.