Cyber Security | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం(డీఓటీ) తీసుకురానున్న నూతన సైబర్ భద్రత నిబంధనల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనలు వినియోగదారుల డాటాపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అధికారాలు కల్పిస్తున్నాయని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగకరమని, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సైబర్ భద్రతను పటిష్ఠం చేసేందుకు రూపొందించిన సైబర్ సెక్యూరిటీ రూల్స్ ముసాయిదాను ఆగస్టు 28న డీఓటీ ప్రకటించింది. 30 రోజుల గడువు ఇచ్చి అభిప్రాయాలు సేకరించింది. టెలికం సంస్థలు, న్యాయ నిపుణులు ఈ నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.
సైబర్ భద్రత కోసం ప్రభుత్వం టెలికం సంస్థల నుంచి వినియోగదారుల సమాచారాన్ని సేకరించేలా కొత్త నిబంధనలు అధికారం కల్పిస్తున్నాయి. ఇప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇలా డాటాను పొందేందుకు ప్రభుత్వానికి చట్టాలు వీలు కల్పిస్తున్నాయని ఇండస్లా సంస్థ భాగస్వామి శ్రేయ సూరి చెప్పారు.
కొత్త నిబంధనలు మాత్రం వ్యక్తిగత డాటాను పూర్తిస్థాయిలో పొందే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తున్నాయని, ఇది డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్(డీపీడీపీ చట్టం)తో పాటు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని ఆమె అభిప్రాయపడ్డారు.