యుద్ధంలో సమిధలుగా..!
విదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తమకు తెలియకుండానే భాగస్వాములుగా మారి సమిధలవుతున్నారు తెలంగాణ యువకులు. బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు, అక్కడి ప్రభుత్వాలు చెప్పిన షరతులకు అంగీకరించి,
- బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి తెలంగాణ బిడ్డలు
- బలవంతంగా రష్యా పౌరసత్వం
- మొర వినిపించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- కుటుంబసభ్యుల ఆందోళన
జగిత్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): విదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తమకు తెలియకుండానే భాగస్వాములుగా మారి సమిధలవుతున్నారు తెలంగాణ యువకులు. బతుకుదెరువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు, అక్కడి ప్రభుత్వాలు చెప్పిన షరతులకు అంగీకరించి, ఏకంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని అక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు అంగీకరిస్తున్నారు. యుద్ధ క్షేత్రంలోకి వెళ్తూ అసువులు బాస్తున్నారు. మన దేశ బిడ్డలను వంచించి, మన బిడ్డల ప్రాణాలను ఫణంగా పెట్టి, వారి దేశం కోసం యుద్ధక్షేత్రంలోకి పరాయి దేశాలు పంపిస్తున్నా భారత ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
బాధిత కుటుంబాలు తమవారి పరిస్థితి గురించి మొరపెట్టుకున్నా భారత సర్కార్ వైఖరిలో మార్పురావడంలేదు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ అయితే ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదులు, మండలాల్లో కేసులు నమోదవుతున్నా ఇంతవరకు సమీక్షించిన పాపానపోలేదు. బతుకుదెరువు కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి, భారత పౌరసత్వాన్ని వదులుకొని అక్కడి యుద్ధ రంగంలో సైనికులుగా మారిపోయిన వారి బాధలు, వ్యథలు ఇలా ..
ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల బిడ్డ ప్రాణం..
జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్‌కు పెండ్లీడుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, క్యాన్సర్ పేషెంట్ అయిన తల్లి ఉండటంతో గల్ఫ్ వెళ్లేందుకు యత్నించాడు. జగిత్యాలకు చెందిన ఓ ఏజెంట్ రూ.లక్ష వేతనం ఉంటుందని చెప్పడంతో ఉక్రెయిన్ వెళ్లి బీకేపీ కంపెనీలో పనిచేశాడు. రెండు నెలల క్రితం రష్యా జరిపిన డ్రోన్ బాంబ్ దాడిలో సుదర్శన్‌గౌడ్ మృత్యువాతపడ్డాడు. ఇంతవరకు ఆయన మృతదేహం స్వగ్రామానికి రాలేదు. సుదర్శన్‌తోపాటు వెళ్లిన మరో ఐదుగురు తెలంగాణ బిడ్డలు ఉక్రెయిన్‌లో క్షణం ఒక యుగంలా బతుకీడుస్తున్నారు.
భారత పౌరసత్వాలు వదిలి.. రష్యా పౌరసత్వాలు పొంది..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపురానికి చెందిన ఎడవెల్లి కనుకయ్య బతుకుదెరువు కోసం ఫిబ్రవరి 10న ఏజెంట్‌కు రూ.2.50 లక్షలు చెల్లించి రష్యాకు వెళ్లాడు. అక్కడ మూడు నెలలు పనిచేసిన తర్వాత ఆర్మీ విభాగంలో శిక్షణ ఇచ్చారు. భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్టుగా కనుకయ్యతో నోటరీ తీసుకుని, రష్యా పౌరసత్వాన్ని ఇచ్చారు. అనంతరం ఉక్రెయిన్ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధ క్షేత్రంలోకి తీసుకువెళ్లి వదిలిపెట్టారు. నాలుగు నెలలుగా కనుకయ్య రష్యా ఆర్మీతో కలిసి యుద్ధ క్షేత్రంలోనే పనిచేస్తున్నాడు.
మరికొందరిదీ అదే కథ..
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్‌కుమార్ జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడు. రూ.2.50లక్షలు చెల్లించి రష్యాకు వెళ్లాడు. రాజ్‌కుమార్ సైతం కనుకయ్యలాగే రష్యా పౌరసత్వాన్ని తీసుకొవాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మునిపల్లికి చెందిన భూక్యా రవీందర్, పెద్దవాల్గోట్‌కు చెందిన సిర్ష అశోక్, చెరువుతండాకు చెందిన మెగావత్ ప్రకాశ్, కామారెడ్డి జిల్లా తాడ్కోల్కు చెందిన అప్జల్‌ఖాన్ (యుద్ధ క్షేత్రంలో ఇతడికి గాయాలు అయినట్లు సమాచారం), పోతురాజ్ విజయ్‌కుమార్, గుజ్జు జగబంధు, మాణిక్యాల నరేశ్, కరీంనగర్ జిల్లా నారాయణపూర్‌కు చెందిన దొమ్మాటి కిషన్ సైతం రష్యాకు లేబర్ పనిపై వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకొని సైనికులుగా పనులు చేస్తున్నారు.
ఏజెంట్ల మోసాలు.. మొదటి మెట్టు
బతుకు దెరువు కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ బిడ్డలు అక్కడి పౌరసత్వాన్ని పొంది, పోరుబాటలోకి వెళ్లడానికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న ఏజెంట్లతోపాటు, రష్యా, ఉక్రెయిన్‌లో తిష్టవేసిన మన ప్రాంతానికి చెందిన ఏజెంట్లే అని చెబుతున్నారు. అక్కడి ఏజెంట్లు వీరిని రిసీవ్ చేసుకొని మూడు నెలలు పని చూపిస్తున్నారు. తదుపరి ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నోటరీ అనంతరం ఆర్మీలో చేరుతున్న మన వాళ్లకు అక్కడి పౌరసత్వాన్ని అందజేయడంతోపాటు, రష్యా, ఉక్రెయిన్ పాస్‌పోర్టులను, ఆర్మీ బ్యాడ్జ్‌లను అందజేస్తున్నారు. భారత కరెన్సీలో రూ.8లక్షలను అందజేస్తుండగా.. రూ.4 లక్షలను అక్కడి ఏజెంట్లు కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
చేతులెత్తేసిన భారత ప్రభుత్వం..
రష్యా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్లి అక్కడి పౌరసత్వంతో ఆర్మీలో పనిచేస్తూ క్షణక్షణం భయంభయంగా బతుకుతున్న మనవాళ్లను రక్షించే విషయంలో కేంద్రం పూర్తిగా చేతులు ఎత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలువురు రష్యా, ఉక్రెయిన్ దేశాల ఆర్మీ క్యాంప్‌ల్లో ఉన్నారని స్పష్టమైంది. దేశంలోని రిక్రూటర్ ఎవరో విదేశీ మంత్రిత్వ శాఖ గుర్తించలేకపోతున్నదని చెబుతున్నారు. ఆయా దేశాల్లో ఉన్న మన కాన్సులేట్లు సైతం మన పౌరుల సంక్షేమం కోసం పనిచేయలేకపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కనీసం సమీక్ష నిర్వహించని రేవంత్ సర్కార్..
పదుల సంఖ్యలో మన యువకులు రష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లి చావుబతుకుల మధ్య పనిచేస్తూ, తమను కాపాడమని వేడుకుంటుంటే రేవంత్ సర్కార్ మీనమేషాలు లెక్కబెడుతున్నది. మూడు నెలలుగా ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రవాసీ అంశాలను పర్యవేక్షిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై స్పందించకపోవడం, సీఎం ప్రకటన చేయకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతోనే పరిష్కారం
పౌరసత్వాలు మార్చడం, మరో దేశ పౌరసత్వం ఇవ్వడం, పాస్‌పోర్టు, మిలటరీ బ్యాడ్జ్‌లు ఇవ్వడం భారత సార్వభౌమాధికార ఉనికిని ప్రశ్నించే అంశం. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించాలి. రష్యాలో చికుకున్న తెలంగాణ బాధితులను తక్షణమే స్వదేశానికి తీసుకురావాలి. స్థానిక, రష్యాలోని ఏజెంట్ల పాత్రపై సమగ్ర విచారణ జరిపి, బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్లే, తిరిగి వచ్చే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి.
– గంగుల మురళీధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ గల్ఫ్ జేఏసీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

