(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గత 30 ఏండ్లుగా దక్షిణ కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్, కోలార్, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర, హసన్ తదితర జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నది. తాగునీటి కష్టాలను తీర్చాలంటూ ఈ ప్రాంతంలోని దాదాపు 70 లక్షల మంది ఏండ్లకేండ్లూ డిమాండ్లు చేశారు. ఉద్యమాలు నడిచాయి. దీంతో 2012లో ఎత్తినహొళె తాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తామని అప్పటి బీజేపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. హసన్ జిల్లా సకలేశపుర వద్ద పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలసిపోయే ఎత్తినహొళె వాగు నుంచి నీటిఎద్దడి ఉన్న ఎగువ ప్రాంతాలకు తాగునీటిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వానకాలంలో జూన్ నుంచి నవంబరు వరకూ 24.05 టీఎంసీల నీటిని.. 873 కిలోమీటర్ల దూరం వరకూ పైప్లైన్లు, కాల్వల ద్వారా తరలించడానికి ప్లాన్ సిద్ధం చేశారు. అవసరమైన చోట ఎత్తిపోతలు ఉండేలా కార్యాచరణ రూపొందించారు. అయితే, పదేండ్లు గడిచినా ప్రాజెక్టు పనులు ముందుకు సాగట్లేదు. భూసేకరణ, నిధుల విడుదలలో జాప్యం, అవినీతి వెరసి ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. 2012లో రూ.8,323 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం.. ప్రస్తుతం రూ.23,251 కోట్లకు చేరుకున్నది.
40 శాతం కమీషన్‌తో జాప్యం
ఎత్తినహొళె తాగునీటి ప్రాజెక్టు నిధుల విడుదలలో తీరని జాప్యం జరుగుతున్నదని ఎత్తినహొళె పథకం ప్రత్యేక అధికారి ఒకరు వివరించారు. 40 శాతం కమీషను వల్ల గుత్తేదార్లు పనుల్ని పూర్తి చేయటం లేదని ఆరోపించారు. ‘ఇంత మొత్తంలో కమీషన్ చెల్లించాక, మిగిలిన దానిలో గుత్తేదారు తన లాభం తాను చూసుకుంటాడు. నిర్మాణ కార్మికులు, యంత్రోపకరణాల కూలీ, సామగ్రి, పర్యవేక్షణ తదితర ఖర్చులు పోగా నిర్మాణానికి ఇంకేం మిగులుతుంది? ప్రాజెక్టు నత్తనడకన సాగేందుకు కారణం ఇదే’ అని ఆయన తెలిపారు.
క్యా బాత్ హై!
మనిషి, యంత్రాలు కలిసి రూపొందించిన అద్భుత నిర్మాణమిది. ఏకంగా ఒక నదినే అచ్చంగా ఎత్తిపోసేశారు. ఈ ప్రాజెక్టు ఎత్తిపోసేది నీటిని కాదు.. లిక్విడ్ గోల్డ్‌ను. దీనికి రైతుల తలరాతను మార్చే శక్తి ఉన్నది.
–కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 2021లో అంతర్జాతీయ చానల్ డిస్కవరీ చేసిన వ్యాఖ్యలివి.
తెలంగాణలో జలసవ్వడి
కడలి పాలయ్యే గోదారి జలాలను ఒడిసిపట్టి నెర్రెలు బారుతున్న తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ తలపోశారు. సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, అంతకుమించి చెక్కుచెదరని సంకల్పం.. వెరసి దశాబ్దాలు గడిచినా పూర్తవ్వని కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణ అంతటా జలసవ్వడులే.
కర్ణాటకలో కమీషన్ కక్కుర్తి
కరువు పీడిత చిక్కబళ్లాపుర్, కోలార్, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర, హసన్ జిల్లాల్లోని 70 లక్షల మంది దాహార్తిని తీర్చాలంటూ దశాబ్దాలుగా డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 2012లో ఎత్తినహొళె ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. పదేండ్లు గడిచాయి. ‘40% కమీషన్’ కారణంగా ప్రాజెక్టు పనులు ఇంకా ఎక్కడికక్కడే పడి ఉన్నాయి.