TS High Court | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే బదిలీకానున్నారు. ఆయనను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని కోరింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే గతేడాది జులైలో నియామకమయ్యారు. సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధేను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. 1964 ఏప్రిల్ 13న రాయ్‌పూర్‌లో జన్మించిన జస్టిస్ అలోక్ 1988లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 ఫిబ్రవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016 సెప్టెంబరులో జమ్ము కశ్మీర్ హైకోర్టుకు బదిలీ కాగా.. 2018లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. కర్ణాటక నుంచి తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. తెలంగాణ హైకోర్టు నుంచి బాంబే హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.