ముంబై, ఆగస్టు 19: దేశంలో ఒకే రోజు మూడు రైళ్లలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం కలవరం కలిగించింది. ఈ ప్రమాదాల్లో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం శనివారం ఉదయం నాగ్‌పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు.
ప్రయాణికులు రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు బెంగళూరులోని సంగొళ్లి రాయన రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం అగ్రి ప్రమాదం జరిగింది. ఉదయం 5.45 గంటలకు రైలు స్టేషన్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. గంటన్నర తర్వాత రైలులోని బీ1, బీ2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంకో ప్రమాదంలో ఉదయ్‌పూర్-ఖజరహో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలోని సిథోలి రైల్వేస్జేషన్కు చేరుకోగానే రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోకో పైలట్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వ్యవస్థను పూర్తిగా ఆపేశారు.