Tejasvi Surya : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా బెంగళూర్‌కు సమీపంలోని ఏరోస్సేస్ పార్క్‌కు చెందిన స్ధలంలో కేఐఏడీబీ భూ కేటాయింపులు జరిపారనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. భూ ఆక్రమణల్లో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని అన్నారు. తేజస్వి సూర్య మంగళవారం హరియాణలోని ఫరీదాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పైనా భూముల విషయంలో ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇవాళ రాజ్యసభలో విపక్ష నేత ఖర్గేపైనా కర్నాటకలో ఇవే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఢిల్లీలో రాబర్ట్ వాధ్రాపై సైతం భూ కబ్జా ఆరోపణలున్నాయని చెప్పారు. ఈ ఆరోపణలను కోర్టులు తీవ్రంగా పరిగణిస్తాయనే విశ్వాసం తనకుందని అన్నారు. కాగా, బెంగళూర్‌కు సమీపంలోని ఓ ఏరోస్పేస్ పార్క్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ఓ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం లభించడం పెను దుమారం రేపుతోంది.
ఖర్గే కుమారుడు రాహుల్ ఈ ట్రస్ట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు కర్నాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు (KIADB) స్ధల కేటాయింపు అధికార దుర్వినియోగమని, కర్నాటక సర్కార్ బంధుప్రీతికి సంకేతమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు.ఈ ఉదంతంపై ఖర్గే సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
ఐదు ఎకరాల భూమిని ఎస్సీ కోటా కింద సిద్ధార్ధ విహార్ ట్రస్ట్‌కు కట్టబెట్టారని, ఈ ట్రస్ట్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే ఇతర కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారని మాల్వీయ పేర్కొన్నారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్ కోసం కేఐఏడీబీ పక్కనపెట్టిన 45.94 ఎకరాల స్ధలంలో ఈ 5 ఎకరాలు భాగమని వివరించారు. స్ధలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సామాజిక కార్యకర్త దినేష్ కలహళ్లి కర్నాటక గవర్నర్ తావర్ చంద్ గహ్లాట్‌కు ఫిర్యాదు చేశారు.
Read More :
MLC Kavitha: పీఎంఎల్ఏ 45(1) సెక్షన్ ప్రకారం బెయిల్‌కు అర్హురాలు: సుప్రీంకోర్టు ధర్మాసనం