న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : ఒకప్పుడు నేనూ క్రికెట్ ఆటగాడ్నే, దేశవాళీ క్రికెట్లో నా కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఆడాడు.. అంటూ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇండియా క్రికెట్ జట్టులో చాలామంది.. ఒకప్పుడు నా బ్యాచ్‌మెట్స్’ అని ‘ఎక్స్’లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ‘ఢిల్లీ తరఫున నా సారథ్యంలో విరాట్ కోహ్లీ ఆడాడు. కొంతకాలం విరాట్, నేను కలిసి ఆడాం. గాయాల కారణంగా క్రికెట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది’ అని ‘ఎక్స్’ పోస్ట్‌లో వివరించారు. 2009లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌తో తేజస్వీ క్రికెట్ కెరీర్ ఆరంభమైంది. ఐపీఎల్ 2008 సీజన్‌కు ‘ఢిల్లీ డేర్‌డెవిల్స్’ తేజస్వీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి చాలామందికి తెలియదు. అయితే తేజస్వీ యాదవ్ 2008 నుంచి 2012 వరకు ఒక్క గేమ్ ఆడకుండా కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితమయ్యాడు.
యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ భార్య తన భర్త రోజూ స్నానం చేయడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని పెండ్లయిన 40 రోజులకే కోర్టుకెక్కింది. తన భర్త ఒంటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని వాపోయింది. దీనిపై భర్త స్పందిస్తూ తాను సాధారణంగా నెలకు ఒకసారో, రెండుసార్లో స్నానం చేస్తానని చెప్పాడు. అధికారుల కౌన్సిలింగ్ ఇవ్వడంతో పరిశుభ్రంగా ఉండటానికి అతడు అంగీకరించాడు. అయినా కలిసి ఉండటానికి అతడి భార్య విముఖత వ్యక్తం చేసింది.