పాట్నా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో శుక్రవారం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు గల్లంతయ్యిందని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ శనివారం ఆరోపించారు. ప్రతి నియోజక వర్గంలో 20-30 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించారని వెల్లడించారు. ఈ ఆరోపణలను వెంటనే ఖండించిన ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలోని తేజస్వీ యాదవ్ వివరాలను వెల్లడిస్తూ ఆయనవి దురుద్దేశపూరిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది.
తొలుత తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో తన ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు(ఎపిక్) నెంబర్ని ఎన్నికల కమిషన్ అధికారిక మొబైల్ యాప్లో నమోదు చేయగా వివరాలు కనిపించడం లేదు’ అని ఎర్రర్ చూపించింది. తన పేరు ఓటరు జాబితాలో లేదని, తాను ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలనని యాదవ్ ప్రశ్నించారు.