Tej Pratap Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) కొత్త పార్టీ పెట్టారు. తన రాజకీయ పార్టీకి జన్‌శక్తి జనతా దళ్ (Janshakti Janata Dal) అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. తన పార్టీ ఎన్నికల గుర్తుగా బ్లాక్ బోర్డు (Black Board) ఉంటుందని వెల్లడించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ప్లాన్‌ను కూడా ప్రకటించారు. పార్టీ పోస్టర్‌ను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు.
బీహార్ సర్వతోముఖాభివృద్ధికి అంకితమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ తెలిపారు. బీహార్‌లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త వ్యవస్థను రూపొందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘జన్‌శక్తి జనతా దళ్’ పార్టీ పోస్టర్లో ఐదుగురు ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. వారిలో మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్లు ఉన్నారు.
అయితే తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ ఫోటోను మాత్రం తన పార్టీ పోస్టర్లో పెట్టుకోలేదు. సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సమూల మార్పు ఆ పార్టీ సందేశంగా వెల్లడించారు. ప్రజాశక్తి, ప్రజాపాలన, బీహార్ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జన్‌శక్తి జనతా దళ్ పార్టీలో చేరాలనుకునే వారి కోసం పోస్టర్లో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తేజ్ ప్రతాప్ తెలిపారు. 2015లో ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. మహువా తన కర్మభూమి అని, అక్కడి నుంచి ఇంకెవరు పోటీ చేసినా ప్రజలు ఓడిస్తారని అన్నారు. కాగా కొన్ని నెలల క్రితం తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ పార్టీ నుంచి, కుటుంబం నుంచి లాలూప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. తాను 12 ఏళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో లాలూ కుటుంబంలో చిచ్చురేగింది.