చెన్నై: చెన్నై-తిరుత్తణి సబర్బన్ రైలులో ఓ వలస కూలీపై పెద్ద కత్తితో దాడి చేసిన నలుగురు టీనేజర్లను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడు ఈ దాడికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేశాడు. తమిళ పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టి, పెద్ద కత్తిని చూపిస్తూ ఈ రీల్ చేశాడు. మరో వీడియోలో నిందితులంతా ఓ ఇంటి వద్ద బాధితునిపై కత్తులతో దాడి చేస్తున్నట్లు కనిపించింది.
నిందితుల్లో ఒకడు బాధితుని పక్కన నిల్చుని ‘విజయ’ చిహ్నం చూపిస్తూ కనిపించాడు. బాధితుడు ఒడిశాకు చెందినవారని తెలుస్తున్నది. ఆయనకు తిరువల్లూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. నిందితులంతా 17 ఏళ్ల వయసువారు. వీరిలో ముగ్గుర్ని చెంగల్పట్టులోని జువెనైల్ హోంకు తరలించారు. మరొకడు ప్రస్తుతం చదువుకుంటుండటంతో, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.