న్యూఢిల్లీ: ఒక విద్యార్థి, అతడి క్లాస్మేట్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్ ముగిసిన తర్వాత క్లాస్మేట్ మరికొందరితో కలిసి కత్తితో అతడిపై దాడి చేశాడు. (Teen Stabbed To Death) తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం షకర్పూర్ ప్రాంతంలోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయంలో క్లాసులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా 14 ఏళ్ల ఇషు గుప్తా మరో విద్యార్థి కృష్ణతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో క్లాస్ ముగిసిన తర్వాత కృష్ణ మరో ముగ్గురు స్టూడెంట్స్తో కలిసి స్కూల్ బయట ఇషు గుప్తాపై దాడి చేశాడు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి కత్తితో అతడ్ని పొడిచాడు.
కాగా, తీవ్రంగా కత్తి గాయమైన ఇషు గుప్తాకు స్కూల్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ స్టూడెంట్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన విద్యార్థి ఇషు గుప్తా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు మైనర్ బాలురు, 19, 31 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు వ్యక్తులతో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.