శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో వలసదారులను ఉగ్రవాదులు మళ్లీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. వలస వచ్చిన ఒక యువకుడిపై తాజాగా కాల్పులు జరిపారు. (migrant shot by terrorists) తీవ్రంగా గాయపడిన యువకుడ్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. ఈ వారంలో మూడో దాడిగా పేర్కొన్నారు. గురువారం ఉదయం త్రాల్‌లోని బటాగుండ్ గ్రామంలో వలస కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్కు చెందిన 19 ఏళ్ల శుభమ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. చేతికి బుల్లెట్ గాయమైన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
కాగా, జమ్ముకశ్మీర్‌లో వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపడం వారం రోజుల్లో ఇది మూడో దాడి. అక్టోబర్ 20న గందర్బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉన్నవారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు సహా ఏడుగురు వ్యక్తులు మరణించారు. ఈ దాడి తమ పనే అని పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
మరోవైపు అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన అశోక్ చౌహాన్ అనే వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. జైనాపోరాలోని వడునా ప్రాంతంలో కాల్పుల గాయాలతో పడి ఉన్న చౌహాన్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.