Teacher arrest : ఆమె ఒక టీచర్..! విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన వ్యక్తి..! కానీ ఆమెనే సంస్కారం మరిచింది..! విద్యార్థిని తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..! ఆపై అతడి నుంచి డబ్బు గుంజింది..! ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో అతడు ఆమెను దూరం పెట్టాడు..! కానీ ఆమె మాత్రం అతడిని వదల్లేదు..! రూ.20 లక్షలు ఇవ్వకపోతే తనతో గడిపిన ఫొటోలు, వీడియోలను అతడి కుటుంబసభ్యులకు పంపుతానని బ్లాక్ మెయిల్ చేసింది. అతడు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాలపాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ పాఠశాలలో శ్రీదేవి రుదగి అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. అదే ఏరియాలో భార్య ముగ్గురు ఆడపిల్లలతో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి సతీష్ తన ఐదేళ్ల చిన్న కుమార్తెను స్కూల్లో వేయడానికి అక్కడికి వెళ్లాడు. ఈ సందర్భంగా రుదగికి, వ్యాపారి సతీష్‌కు మద్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది.
ఆ బంధాన్ని ఆసరాగా చేసుకుని సతీష్ నుంచి రుదగి రూ.4 లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. దాంతో రుదగి గణేశ్ కాలే (38), సాగర్ (28) సాయంతో సతీష్‌పై ఒత్తిడి పెంచింది. రూ.20 లక్షలు ఇవ్వకపోతే తనతో ప్రైవేటుగా గడిపిన వీడియోలు, ఫొటోలను అతడి భార్యకు పంపుతానని బెదిరించింది. దాంతో సతీష్ తన కుటుంబాన్ని గుజరాత్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం టీసీ తీసుకునేందుకు స్కూల్‌కు వెళ్లాడు. అది అతడి పాలిట పీడకలగా మారింది. సతీష్ టీసీ కోసం రుదగి దగ్గరికి వెళ్లేసరికే గణేశ్ కాలే, సాగర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తన దగ్గరున్న వీడియోలు, ఫొటోలను రుదగి.. సతీష్‌కు చూపించింది. రూ.20 లక్షలు ఇస్తావా.. లేదంటే వీడియోలను మీ ఇంట్లో వాళ్లకు పంపాలా అని బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో భయపడిపోయిన సతీష్ రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పుకుని బయటికి వచ్చాడు.
ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో రుదగి నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. వీడియోలో మీ భార్యకు పంపుతానంటూ నిత్యం బెదిరించసాగింది. దాంతో విసిగిపోయిన సతీష్ పోలీసులను ఆశ్రయించాడు. విషయం అంతా తెలుసుకున్న పోలీసులు రుదగిని, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.