TB Test | న్యూఢిల్లీ: క్షయ వ్యాధి పరీక్షకు అస్సాంలోని దిబ్రుగఢ్లో ఉన్న ఐసీఎంఆర్-ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం(ఆర్ఎంఆర్సీ) కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా కేవలం రూ.35 ఖర్చుతో టీబీ పరీక్ష చేయొచ్చు. సీఆర్ఐఎస్పీఆర్ ఆధారిత టీబీ పరీక్షను రోగుల కఫంతో చేస్తారు. సులువుగా, మూడు దశల్లో ఈ పరీక్ష ఉంటుంది. రెండున్నర గంటల్లో దాదాపు 1,500 నమూనాల పరీక్షలను ఏకకాలంలో చేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎక్కువగా మైక్రోస్కోపీ, నూక్రియిక్ యాసిడ్ ఆధారిత పరీక్ష పద్ధతులు పాటిస్తున్నారు. వీటి ద్వారా టీబీ లేదని నిర్ధారణ అయ్యేందుకు 42 రోజుల సమయం పడుతుంది.
పైగా ఈ పరీక్షలకు ఖరీదైన యంత్రాలు అవసరం. తాము అభివృద్ధి చేసిన కొత్త పరీక్ష విధానంతో సులువుగా, వేగంగా, చౌకగా టీబీ పరీక్షను జరపొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గానూ సంస్థలు, పరిశ్రమలు, తయారీదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం తెలిపినట్టు పేర్కొన్నది. క్షయ వ్యాధి తీవ్రంగా మారకముందు గుర్తించడం చాలా అవసరమని, ఈ దిశగా కొత్త పరీక్ష విధానం కీలకంగా మారబోతున్నట్టు ఐసీఎంఆర్ భావిస్తున్నది.