బిలాస్పూర్ : భర్త నిరుద్యోగిగా ఉండటాన్ని భార్య ఎత్తిపొడవటం, ఎగతాళి చేయడం, ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు అసమంజసమైన కోరికలు కోరడం మానసిక క్రూరత్వమేనని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తెలిపింది. ఈ కారణాల రీత్యా భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఆయనకు విడాకులు మంజూరు చేసేందుకు తిరస్కరించిన కుటుంబ న్యాయస్థానం తీర్పును రద్దు చేసింది.
భార్య పీహెచ్డీ పట్టా పొందిన తర్వాత, స్కూలు ప్రిన్సిపాల్‌గా అధిక వేతనం గల ఉద్యోగాన్ని పొందిన అనంతరం, తన భర్త పట్ల ఆమె ప్రవర్తన మారిపోయినట్లు రుజువైందని హైకోర్టు తెలిపింది. ఆయన పట్ల ఆమెకు గౌరవం లేకుండా పోయిందని, కొవిడ్-19 మహమ్మారి సమయంలో నిరుద్యోగిగా ఉన్నందుకు ఆయనను తరచూ ఎగతాళి చేస్తూ ఉండేదని పేర్కొంది. అల్పమైన విషయాలపై సైతం తరచూ జగడాలకు దిగుతుండేదని పేర్కొంది. ఇటువంటి చర్యలు చట్టప్రకారం మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది.