న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ప్రధాన మంత్రికి సలహాదారుగా, ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)లో భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి, స్కేల్లో తొలుత రెండేళ్ల కాలానికి తరుణ్ కపూర్‌ను నియమించడాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది’ అని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన తరుణ్ కపూర్, గత ఏడాది నవంబర్ 30న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు.
మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అదనపు కార్యదర్శులుగా సీనియర్ అధికారులు హరి రంజన్ రావు, అతిష్ చంద్ర నియమితులయ్యారు. హరి రంజన్ రావు మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం టెలికమ్యూనికేషన్స్ విభాగంలోని యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన ఉన్నారు.
కాగా, బీహార్ క్యాడర్‌కు చెందిన అతిష్ చంద్ర కూడా రావు బ్యాచ్‌మేట్. ప్రస్తుతం ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఉన్నారు.