AAP win : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పంజాబ్ (Punjab) లో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. తారన్ తరన్ నియోజకవర్గం (Tarn taran Constituency) నుంచి పంజాబ్ అసెంబ్లీ (Punjab Assembly) కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) కశ్మీర్ సింగ్ సోహల్ (Kashmir Sing Sohal) ఈ ఏడాది జూన్‌లో మరణించడంతో.. ఆ స్థానానికి ఈ నెల 11న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి (AAP candidate) హర్మీత్ సింగ్ సంధూ (Harmeet Singh Sandhu) 12 వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థికి మొత్తం 42,649 ఓట్లు రాగా.. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి రంధావాకు 30,558 ఓట్లు పోలయ్యాయి. అంటే 12,091 ఓట్ల మెజారిటీతో ఆప్ తన సిట్టింగ్ స్థానంలో గెలిచింది. స్వతంత్య్ర అభ్యర్థి మన్దీప్ సింగ్ 19,620 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌కు నాలుగో స్థానం, బీజేపీకి ఐదో స్థానం దక్కింది.
కాగా ఈ విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా.. ఆరు స్థానాల్లో ఆప్ గెలిచింది.