Tariff cuts : భారత్ అధికంగా సుంకాలు వసూలు చేస్తోందన్న విషయాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే ఆ దేశం సుంకాలను తగ్గించేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడంపై భారత్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను భారత అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. సుంకాల తగ్గింపు చర్యలు నిజమే అయినా ట్రంప్ ఒత్తిడి ఈ నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పాయి.
గతంలో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో వరుసగా ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్, నార్వే లాంటి దేశాలపై భారత్ సుంకాలను తగ్గించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఐరోపా సమాఖ్యతో, యూకేతో పలు ఒప్పందాల కోసం చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సుంకాలను తగ్గించాలని న్యూఢిల్లీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అంతేతప్ప అమెరికా భారత్‌పై విధించనున్న సుంకాల భయంతో కాదని అన్నారు.
అయితే.. వ్యవసాయ ఉత్పత్తులు మినహా అన్ని వస్తువులపై సుంకాలను తగ్గించాలని అమెరికా భారత్‌ను కోరింది. వాస్తవానికి భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో 118.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో భారత్ ముందుకు వెళ్తోంది.
కాగా భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ పలుమార్లు చెప్పారు. భారత్‌ను టారిఫ్ కింగ్‌గా అభివర్ణిస్తూ.. భారత్ తన వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 2న భారత్, చైనా దేశాలపై తాము విధించే సుంకాలు అమెరికా దశను మార్చనున్నాయని అన్నారు.