Tania Sachdev : ఢిల్లీ తరఫున, దేశం తరఫున ఆడి తాను పతకాలు తీసుకొచ్చినా ప్రభుత్వం తనను గుర్తించలేదని చెస్ క్రీడాకారిణి (Chess player) తానియా సచ్దేవ్ (Tania Sachdev) సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఆమె విమర్శలు చేసిన మరుసటి రోజే అంటే మంగళవారం సాయంత్రం ఢిల్లీ సీఎం (Delhi CM) అతిషి (Atishi).. తానియాను తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు.
తానియా సచ్దేవ్ భావితరం చెస్ క్రీడాకారులకు ఆదర్శమని సీఎం అతిషి ప్రశంసించారు. తానియాతో సమావేశం అద్భుతంగా జరిగిందని, ఢిల్లీలో చెస్‌ను ప్రమోట్ చేయడంపై ఆమె తనతో కొన్ని ముఖ్యమైన అంశాలను పంచుకున్నారని అతిషి తెలిపారు. తానియాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని, ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు చెస్ నేర్పించడానికి సచ్దేవ్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నామని పేర్కొన్నారు.
ఢిల్లీలో చెస్‌ను ప్రమోట్ చేయడానికి సంబంధించి ఆమె కొన్ని సమస్యలను తానియా తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అతిషి తెలిపారు. తానియా సచ్దేవ్ భవిష్యత్తు మరింత బాగుండాలని తాను కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. 2008 నుంచి తాను దేశం కోసం, ఢిల్లీ కోసం ఆడుతున్నా ఢిల్లీ సర్కారు తనను గుర్తించడం లేదని తానియా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఈ క్రమంలో అతిషి ఆమెను కలిసి మాట్లాడారు.