Vijay | తమిళనాడు రాజకీయాలు మరోసారి అన్‌ప్రిడిక్టబుల్‌గా మారాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకదానికి ఒకటి పొంతన లేకుండా రావడంతో, ఎవరు గెలుస్తారన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు తొలిసారి బరిలోకి దిగిన టీవీకే పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి ఎగ్జిట్ పోల్స్‌లో ఏకాభిప్రాయం కనిపించలేదు. కొన్ని జాతీయ సర్వే సంస్థలు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మంచి స్థాయి విజయాన్ని అంచనా వేస్తుండగా, మరికొన్ని సంస్థలు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. అదే సమయంలో స్థానిక తమిళ ఛానెల్స్ మాత్రం డీఎంకే విజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి. ఈ విభిన్న అంచనాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అనిశ్చితిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈసారి ఓటర్ల మౌనం సర్వే సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా యువ ఓటర్లు, మొదటిసారి ఓటు వేసే వారు తమ అభిప్రాయాన్ని బయటపెట్టకపోవడం వల్ల అంచనాలు తారుమారయ్యాయని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ అతిపెద్ద ఎక్స్-ఫ్యాక్టర్‌గా మారింది. కొన్ని సర్వేలు ఆ పార్టీకి కేవలం 5 నుంచి 10 సీట్లు మాత్రమే ఇస్తుండగా, మరికొన్ని సర్వేలు 100కి పైగా స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. ఈ భారీ వ్యత్యాసం ఓటర్ల ఓటింగ్ ప్యాటర్న్‌పై ఉన్న అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది.
అలాగే, ప్రభుత్వ వ్యతిరేకత కంటే “సైలెంట్ వేవ్” ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. సంక్షేమ పథకాల ప్రభావం ఒకవైపు ఉండగా, నీట్ వంటి సున్నిత అంశాలు, అవినీతి ఆరోపణలు మరోవైపు ప్రభావం చూపుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య ఉన్న సన్నని గీతను అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి, ఈసారి తమిళనాడులో హంగ్ పరిస్థితి రావచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్రిముఖ పోటీ, పెరిగిన పోలింగ్ శాతం లెక్కలను మరింత క్లిష్టతరం చేశాయి. అసలు ఫలితాలు వెలువడే మే 4 వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగడం ఖాయం.