చెన్నై: తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ పార్టీలైన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఈ పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే ముందుకు వచ్చిన పక్షంలో తమ పార్టీకి చెందిన మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం గురువారం సాయంత్రం హెచ్చరించినట్లు వర్గాలు వెల్లడించాయి. డీఎంకే, అన్నాడీఎంకే శిబిరాలలో రెండు కీలక సమావేశాలు జరిగిన నేపథ్యంలో టీవీకే నుంచి ఈ నిర్ణయం వెలువడింది. ప్రజలు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును దెబ్బతీసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రెండు ద్రవిడ పార్టీలు కుమ్మక్కు అవుతున్నట్లు టీవీకే అనుమానిస్తున్నది.
విజయ్ గెలుపొందిన రెండు స్థానాలతో కలుపుకొని టీవీకే 108 స్థానాల్లో గెలుపొందింది. అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమను ఆహ్వానించాలని టీవీకే వాదిస్తున్నది. కాగా, గురువారం ఉదయం అత్యవసరంగా సమావేశమైన డీఎంకే నాలుగు తీర్మానాలను ఆమోదించింది. అత్యవసర నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌కు అప్పగిస్తూ డీఎంకే తీర్మానం ఆమోదించినట్లు వర్గాలు తెలిపాయి. మళ్లీ ఎన్నికలను నివారించడమే తమ ప్రధాన ధ్యేయమని, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, మతతత్వ శక్తులకు స్థానం ఉండకూడదన్నదే తమ లక్ష్యమని డీఎంకే పేర్కొంది.