న్యూఢిల్లీ, మే 15 : రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయాలు తీసుకునే విచక్షణాధికారాల విషయంలో గవర్నర్‌కు, రాష్ట్రపతికి న్యాయస్థానాలు గడువును నిర్దేశించగలవా? అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యంత అరుదుగా ఉపయోగించే రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద తనకు గల ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు పలు ప్రశ్నలు సంధించారు. చట్టానికి లేదా వాస్తవాలకు సంబంధించి ఏదైనా సందేహం ఏర్పడినపుడు దాన్ని నివృత్తి చేసుకునేందుకు రాష్ట్రపతి ఆర్టికల్ 143(1) కింద సుప్రీంకోర్టును సంప్రదించే అధికారం ఉంది. రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలపై సంప్రదింపులు జరిపిన తర్వాత సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి తెలియచేసే అవకాశం ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలియచేయకుండా కాలయాపన చేయటాన్ని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 8న తీర్పు ఇస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణీత కాల వ్యవధిలోగా ఆమోదం తెలియచేయాలని ఆదేశించింది.
రాష్ట్రపతికి గడువును నిర్దేశించే అధికారం న్యాయస్థానానికి ఉందా అన్న ప్రశ్నలు లేవనెత్తిన రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధిస్తూ వీటికి సమాధానాలు కోరారు. తన ఐదు పేజీల లేఖలో రాష్ట్రపతి ముర్ము సుప్రీంకోర్టుకు ప్రశ్నలను సంధిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు సంబంధించి ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్, రాష్ట్రపతికి గల అధికారాలపై అభిప్రాయం తెలియచేయాలని కోరారు. రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం గవర్నర్ బిల్లులు నివేదించడం ఆర్టికల్ 201 పరిధిలోకి వస్తుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్షను కోరకుండా రాష్ట్రపతికి కేంద్రం నివేదించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రివ్యూ పిటిషన్లకు సంబంధించిన నిబంధనల ప్రకారం కేంద్రం దాఖలు చేసే పిటిషన్లను తీర్పు ఇచ్చిన అదే ధర్మాసనం చాంబర్లలో విచారణ జరుపుతుంది. కాగా, రాష్ట్రపతి నుంచి వచ్చే నివేదనలను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. అయితే రాష్ట్రపతి అడిగిన అన్ని ప్రశ్నలను తిరస్కరించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది.
రాజ్యాంగంలోని 200 అధికరణ కింద తనకు సమర్పించిన బిల్లుపై గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ప్రత్యామ్నాయాలు ఏమిటి? తన వద్దకు బిల్లు వచ్చినపుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద తనకు గల అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూనే మంత్రివర్గ సూచనలు, సలహాలకు గవర్నర్ కట్టుబడి ఉండాలా? రాజ్యాంగపరమైన విచక్షణాధికారాలను గవర్నర్ ఉపయోగించుకోవడం న్యాయ సమ్మతమా, కాదా? అంటూ ..రాష్ట్రపతి పలు ప్రశ్నలను సంధించారు.
ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి గవర్నర్‌కు గడువును నిర్దేశించిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 200 కింద గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర మంత్రివర్గం సూచనకు కట్టుబడి తప్పనిసరిగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి పెండింగ్‌లో ఉంచితే సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం సూచించింది.