చెన్నై: వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనను తమిళనాడులో నిలిపివేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించనప్పటికీ చెన్నైలోని థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 13 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అయితే ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని చెప్పారు. అలాగే ఈ సినిమా ప్రదర్శన వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీంతో మల్టీప్లెక్స్లలోని ఇతర సినిమా షోలపై దీని ప్రభావం పడుతున్నదని, వాటి ఆదాయం పడిపోతున్నదని వాపోయారు. అందుకే ఈ సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పలు ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సంస్థలు మూవీల జాబితా నుంచి ‘ది కేరళ స్టోరీ’ని తొలగించాయి.
కాగా, ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తాజాగా థియేటర్ యజమానులు నిర్ణయించారు. అయితే తమిళనాడులోని అధికార డీఎంకేతో సన్నిహిత సంబంధాలున్న రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఆ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ని చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది.