Ponmudy | తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి దంపతులకు ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో (corruption case) మంత్రికి మద్రాసు కోర్టు (Madras High Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో మంత్రి దంపతులకు ఒక్కొక్కరికి (పొన్ముడికి ఆయన భార్యకి) రూ. 50 లక్షలు చొప్పున జరిమానా కూడా వేసింది.
1996-2001లో డీఎంకే నేతృత్వంలో పొన్ముడి మంత్రిగా ఉన్నప్పుడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పొన్ముడి, ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) అధికారులు 2002లో కేసు నమోదు చేశారు. రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదయ్యింది. అయితే, ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి, అతని భార్య పీ విశాలాక్షిని నిర్దోషులుగా ప్రకటించింది.
అయితే, ఆగస్టు నెలలో ఈ కేసును మద్రాసు హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే డిసెంబర్ 19న ఈ కేసును విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. పొన్ముడిని నిర్దోషిగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ఆయనతోపాటు భార్యను గురువారం కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసులో మంత్రి దంపతులను దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం కింద మంత్రి దంపతులను దోషులుగా ప్రకటించింది. ఈ మేరకు మంత్రికి మూడేళ్లు సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా మంత్రికి, ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు. మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు. దీంతో శిక్షను పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థానం 30 రోజుల సమయం ఇచ్చింది.
Also Read..
Twitter | ఎక్స్‌లో పోస్టులు మాయం.. గందరగోళానికి గురవుతున్న యూజర్లు
Parliament breach | లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. పోలీసుల అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు