చెన్నై: తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో 50 మందికిపైగా మరణించిన కల్తీ మద్యం విషాదానికి (Tamil Nadu hooch tragedy) బీజేపీ కారణమని అధికార డీఎంకే పార్టీ విమర్శించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై దీనికి కుట్ర పన్నారని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి ఆరోపించారు. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన మిథనాల్‌ను బీజేపీ కూటమి పాలిత రాష్ట్రమైన పుదుచ్చేరి నుంచి సేకరించారని అన్నారు.
డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం మరణాలకు బాధ్యత వహించి సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలన్న అన్నామలై డిమాండ్‌పై ఆయన స్పందించారు. ‘ఎవరైనా రాజీనామా చేయాల్సి వస్తే, అది బీజేపీ మంత్రులు, పుదుచ్చేరి సీఎం. ముడిసరుకు అక్కడి నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కల్తీ మద్యానికి బీజేపీనే బాధ్యత వహించాలి. వారే ఈ పని చేశారు. అన్నామలై చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్ర ఇది. ఎన్నికలకు ముందు జరిగిందా అనే సందేహం ఉంది’ అని అన్నారు.
కాగా, గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలకు బీజేపీ నేతలు, మంత్రులు బాధ్యత వహించారా? అని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి నిలదీశారు. ‘డార్జిలింగ్ రైలు ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి రాజీనామా చేశారా? నీట్ కుట్రలకు కేంద్ర మంత్రి రాజీనామా చేశారా? 2009లో కల్తీ మద్యం తాగి 137 మంది చనిపోతే నరేంద్ర మోదీ రాజీనామా చేశారా?’ అని ప్రశ్నించారు. కల్తీ మద్యం సంఘటనకు సంబంధించి అన్నామలై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.