చెన్నై: తమిళనాడులో మంగళవారం మరో కొత్త వివాదం రాజుకుంది. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించిన రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించిందని, ప్రభుత్వం గవర్నర్కు రాసిచ్చిన ప్రసంగ పాఠంలో అనేక లోపాలు, నిరాధార ఆరోపణలు ఉన్నాయని లోక్ భవన్ తన ప్రకటనలో ఆరోపించింది. కాగా, గవర్నర్ చర్యను సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. గవర్నర్ ప్రవర్తన ఆమోదనీయం కాదని ఆయన తెలిపారు.
కేరళ అసెంబ్లీలోనూ..
కేరళలో సీఎం, గవర్నర్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. గవర్నర్ అర్లేకర్ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవలేదని, కేంద్రంపై ఆరోపణలు ఉన్న కొన్ని భాగాలను తొలగించారని సీఎం విజయన్ ఆరోపించారు. విధాన సభలో గవర్నర్ ప్రసంగం ముగించి వెళ్లిపోయిన తర్వాత సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ పేరాగ్రాఫ్ 12 ప్రారంభం, 15వ పేరాగ్రాఫ్ ముగింపు భాగాన్ని గవర్నర్ చదవకుండా ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టేశారని ఆరోపించారు.