Blood Art | చెన్నైకి చెందిన గణేషన్ తనకు కాబోయే భార్య పుట్టినరోజున అపూర్వమైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తన సమస్యను తన స్నేహితుడితో పంచుకోగా.. ‘బ్లడ్ ఆర్ట్’ గురించి ఆ స్నేహితుడు సలహా ఇచ్చాడు. దాంతో గణేషన్ చెన్నైలోని ఓ బ్లడ్ ఆర్టిస్ట్ దగ్గరికెళ్లి తన కాబోయే భార్య ఫొటోను బ్లడ్ ఆర్ట్‌గా చిత్రించి ఇవ్వాలని కోరాడు. అతడి నుంచి 5 ఎంఎల్ రక్తాన్ని తీసుకున్న సదరు ఆర్టిస్ట్.. అనుకున్న సమయానికి ఆయన కోరిన విధంగా బహుమతిని సిద్ధం చేశాడు. ఇది ఒక్క గణేషన్ ఒక్కరి అపూర్వ బహుమతే కాదు. ఎందరో యువకులు తమ ప్రియమైన వారి కోసం ఈ గిఫ్ట్‌లను సిద్దం చేస్తున్నారు. అయితే, ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమని భావించిన తమిళనాడు ప్రభుత్వం.. ఈ బ్లడ్ ఆర్ట్‌పై నిషేధం విధించింది.
తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘బ్లడ్ ఆర్ట్’ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోతున్నది. ఎందరో తమ ప్రియమైనవారికి రక్తంతో తయారుచేసిన ఆర్ట్ వర్క్‌లను బహుమతులుగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది వారిని ప్రత్యేకంగా నిలబెట్టడం తర్వాత సంగతి కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దాంతో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలో ‘బ్లడ్ ఆర్ట్’ ను ప్రభుత్వం నిషేధించింది. గత నెల 28 న తమిళనాడు ఆరోగ్యమంత్రి ఎంఏ సుబ్రమణ్యం చెన్నైలోని బ్లడ్ ఆర్ట్ స్టూడియోను ఆకస్మికంగా సందర్శించడంతో ఈ తతంగం బయటపడింది. అక్కడ అనేక సూదులు, రక్తం నింపిన గాజు గొట్టాలను చూసి మంత్రి ఆశ్చర్యపోయాడు. నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారం రక్తం తీసుకునే ప్రక్రియ చేపట్టడం లేదని మంత్రి గుర్తించారు. చాలా మంది నుంచి రక్తం తీసేందుకు ఒకే సూదిని వాడటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ఈ విషయంపై అధికారుల నుంచి పూర్తి నివేదిక కోరారు. అనంతరం బ్లడ్ ఆర్ట్‌పై ప్రభుత్వం నిషేధం విధించేలా చర్యలు తీసుకున్నారు.
రక్తంతో పెయింటింగ్స్ వేసే వ్యక్తులు లేదా సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎంఏ సుబ్రమణ్యం తెలిపారు. రక్తదానం ఒక పుణ్య కార్యం అని, అటువంటి రక్తాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించకుండా ఇలా ఆర్ట్ పనులకు వినియోగించడం ఆమోదయోగ్యం కాదన్నారు. కావాల్సిన వారి పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించడానికి అనేక మార్గాలు ఉండగా, ఇలా రక్తంతో తయారుచేసిన చిత్రాలను బహుమతిగా ఇవ్వడమేంటని స్థానికులు ముక్కుపై వేలేసుకుంటున్నారు.