Tamil Nadu : తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపరకుండ్రం కొండపై దీపం వెలిగించవచ్చు అంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో (ఎస్ఎల్పీ ) స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 11నే ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని మధురై సమీపంలో తిరుపరకుండ్రం అనే కొండపై అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది.
ఈ కొండపై ఒక దీప స్తంభం ఉంటుంది. అది 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ దిగువన ఒక దర్గా ఉంది. అయితే, ఈ దీప స్తంభంలో చాలాకాలంగా దీపం వెలిగించడం లేదు. కానీ, గతంలో ఇక్కడ దీపం వెలిగించాలని, ఇందుకు అనుమతించాలని కోరుతూ కొన్ని హిందూ సంఘాలు మధురై కోర్టును ఆశ్రయించాయి. దీంతో అక్కడ దీపం వెలిగించేందుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఇక్కడ దీపం వెలిగించరాదు అనేందుకు తగిన ఆధారాలు లేవని హైకోర్టు నమ్మింది. దీంతో దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మధురై కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని గత జనవరిలో హైకోర్టు సమర్పించింది. ఈ ఆదేశాలతో గత కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడి దీప స్తంభం వద్ద దీపం వెలిగించారు. అయితే, ఈ నిర్ణయాన్ని మరోసారి తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
దీపం వెలిగించుకోవచ్చు అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి హిందూ సంఘాలు, బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. న్యాయపరమైన చిక్కులు ఉండటం, కొండ కింద దర్గా ఉండటం వల్ల మతపరమైన ఇబ్బందులు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో దీపం వెలిగించాల్సిందే అని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి.