చెన్నై: మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తనే ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. (TN Collector Fired) ఆ జిల్లా నుంచి బదిలీ చేసింది. తమిళనాడులోని మైలదుత్తురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మూడున్నర ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడటం ఆ రాష్ట్రంలో సంచలనం రేపింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఫిబ్రవరి 28న మైలదుత్తురై జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతి ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చిన్నారిపై జరిగిన లైంగిక దాడి గురించి ఆయన మాట్లాడారు. ‘నాకు అందిన రిపోర్ట్ ప్రకారం ఆ పాప తప్పుగా ప్రవర్తించింది. బాలుడి ముఖంపై ఆ చిన్నారి ఉమ్మి వేసింది. అదే ఆమెపై లైంగిక దాడికి కారణం కావచ్చు. అందువల్ల పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసును రెండు వైపులా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం’ అని అన్నారు.
మరోవైపు కలెక్టర్ ఏపీ మహాభారతి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తన చర్య లైంగిక దాడికి దారి తీస్తుందని ఆ చిన్నారికి ఎలా తెలుస్తుందని కొందరు ప్రశ్నించారు. మూడున్నర ఏళ్ల అమాయక బాలిక ప్రవర్తనను ఒక జిల్లా కలెక్టర్ తప్పుపట్టడంపై మరికొందరు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దీనిపై స్పందించింది. జిల్లా కలెక్టర్ ఏపీ మహాభారతిపై శనివారం వేటు వేసింది. ఆయనను మైలదుత్తురై నుంచి బదిలీ చేసింది. ఆ అధికారికి ఏ పోస్ట్ ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.