CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు. గతంలో 12 ఏళ్లక్రితం మోదీని విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ, ఈసారి విజయ్ సీఎం హోదాలో ప్రధానిని కలవడం విశేషం.
మోదీ, విజయ్ ఈరోజు దాదాపు 25 నిమిషాలపాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం విజయ్.. న్యూఢిల్లీలోని తమిళనాడు హౌజ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు అధికారిక స్వాగతం లభించింది. ఇది సీఎం హోదాలో విజయ్ మొదటి ఢిల్లీ పర్యటన. అక్కడ అధికారికంగా పర్యటిస్తున్న విజయ్ మొదటి పర్యటన కాబట్టి కేంద్రంలోని కీలక నేతలతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.
తమిళనాడుకు సంబంధించి కొన్ని అభ్యర్థనల్ని కూడా విజయ్.. ప్రధాని, కేంద్ర మంత్రులకు సమర్పించే అవకాశం ఉంది. అలాగే, తమిళనాడులో టీవీకే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో సహకరించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడా భేటీ కానున్నారు. ఢిల్లీలోని జన్‌పథ్‌లో వీరితో సమావేశమయ్యే అవకాశం ఉంది.