Udhayanidhi Stalin | తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్ లభించబోతున్నది. త్వరలోనే డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం హింట్స్ ఇచ్చారు. దీంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నిరాశ పడాల్సిన అవసరం లేదని.. మార్పు ఉంటుందన్నారు. ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులతోనూ చర్చలు జరుపుతారన్నారు. అమెరికా పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ.. పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు.
అదొక శ్వేతపత్రమేనన్నారు. స్టాలిన్ అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 18 కంపెనీలతో రూ.7,616 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన స్టాలిన్ రెండుసార్లు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించారు. ప్రభుత్వంలో ఉదయనిధి స్టాలిన్‌కు పెద్దపీట వేస్తారని పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది. ఇటీవల ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంలో స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని ఇటీవల మంత్రి అన్బరసన్ తెలిపారు. తాజాగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలతో ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడం ఖాయమని తెలుస్తున్నది. ప్రస్తుతం ఉదయనిధి యువజన సంక్షేమం, క్రీడల మంత్రిగా కొనసాగుతున్నారు. డీఎంకేలో యూత్ విభాగానికి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే, డెప్యూటీ సీఎం పదవిపై ఉధయనిధి గతవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టిపడేశాడు. పూర్తిగా సీఎం నిర్ణయమని తెలిపారు.