న్యూఢిల్లీ: వచ్చే నెల 12న తాజ్‌మహల్ మూతపడనుంది. నాలుగు గంటలపాటు సందర్శకులను ఎవ్వరనీ అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలకు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న విదేశీ ప్రతినిథులు తాజ్‌మహల్, ఎర్రకోట, బేబీ తాజ్‌తోపాటు ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే నెల 12న నాలుగు గంటలపాటు పర్యాటకులను తాజ్‌మహల్‌లోకి అనుమతించడం లేదని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ నవ్‌జీత్ సింగ్ చాహల్ తెలిపారు. అయితే అతిథులు ఏ సమయంలో వస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా మహిళా సాధికారతపై ప్రతినిథులు చర్చించే అవకాశం ఉందని చెప్పారు.