న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో తహవూర్ విచారణను ఎదుర్కొంటాడని వారు చెప్పారు.
నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి బయల్దేరింది. బుధవారం ఉదయం 7.10 (భారతీయ కాలమానం) గంటలకు బయల్దేరిన విమానం గురువారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని వారు చెప్పారు. రాణా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలిస్తుంది. రాణా తరలింపు దృష్ట్యా తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.