Zakir Hussain | న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చగా మరణించారని ఆయన స్నేహితుడు, ఫ్లూటిస్ట్ రాకేశ్ చౌరాసియా తెలిపారు. మరణించే సమయంలో హుస్సేన్ పెద్ద కుమారుడు, తబలా కళాకారుడు అల్లా రఖా తండ్రి వద్దే ఉన్నారు.
హుస్సేన్ మృతికి పలువురు సంగీతకారులు, నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కూడా ప్రముఖ తబలా సంగీతకారుడే. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేండ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించే వారు. ముంబైలో గ్రాడ్యుయేషన్, జాకీర్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టోరల్ డిగ్రీని పూర్తి చేశారు.
ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో హుస్సేన్ ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు గెల్చుకున్నారు. పలు భారత, అంతర్జాతీయ కళాకారులతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. జాకీర్ హుస్సేన్ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీతకారుడు హుస్సేనే. ఆయన సేవలకు భారత ప్రభుత్వం1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్, 2023లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.
1999లో అమెరికా ఆయనకు నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ ప్రదానం చేసినప్పుడు భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. అతను 1973లో ఇంగ్లిష్ గిటారిస్ట్ జాస్ మెక్లాగ్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్, పెర్కెషన్ వాద్యకారుడు టీహెచ్ విక్కు వినాయక్‌రామ్‌తో కలిసి చేసిన సంగీత ప్రాజెక్టు సంగీత ప్రియులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లింది. జాకీర్ హుస్సేన్ నటుడు కూడా. ఆయన శశికపూర్‌తో ఒక హాలీవుడ్‌తో పాటు పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు.