న్యూఢిల్లీ: మలేరియా ఔషధం ‘కోఆర్టెమ్ బేబీ’కి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని నోవార్టిస్ కంపెనీ తయారు చేస్తున్నది. శిశువులు, చిన్న పిల్లలకు మలేరియా చికిత్సలో ఈ ఔషధాన్ని వాడవచ్చు. ఈ వయసు బాలలకు మలేరియా చికిత్సలో వాడటానికి అనుమతి పొందిన మొదటి ఔషధం ఇదేనని నోవార్టిస్ తెలిపింది. 1999లోనే కోఆర్టెమ్ ఉత్పత్తిని ప్రారంభించామని, చిన్న పిల్లల కోసం తగిన మార్పులు చేసి తాజాగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నామని వెల్లడించింది. మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్ శాస్త్రీయ, ఆర్థిక సహకారంతో ఈ చికిత్సను అభివృద్ధిపరిచినట్లు వివరించింది. దోమల నుంచి వ్యాపించే మలేరియాను గుర్తించడం, నిరోధించడం, చికిత్స చేయడం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంది.