న్యూఢిల్లీ/లక్నో, మే 16: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి ఘటనలో ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను నిందితుడిగా చేర్చారు. అంతకుముందుగా పోలీసులు మలివాల్ ఇంటికి వెళ్లి ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. కాగా, ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సైతం సుమోటోగా తీసుకుంది.
బిభవ్ కుమార్‌కు గురువారం సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. దాడి వ్యవహారంపై మలివాల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, తన పట్ల జరిగింది తీవ్రమైన తప్పిదమని ఆమె పేర్కొన్నారు. గడిచిన కొన్ని రోజులు తనకు చాలా కఠినమైనవని, తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారని, వారికి కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని అన్నారు.
ఘటనపై నోరెత్తని కేజ్రీవాల్
మలివాల్‌పై దాడి ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. గురువారం లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వాతి మలివాల్ ఘటనపై మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు. అఖిలేశ్ యాదవ్ మైక్ తీసుకొని.. అడగడానికి ఇంకా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయని సూచించారు.
తర్వాత ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ.. మణిపూర్‌లో కార్గిల్ యుద్ధవీరుడి భార్యను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ ఇప్పటికీ నోరెత్తడం లేదని, వేలాది మంది మహిళలపై లైంగికదాడికి పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటేందుకు బీజేపీ అనుమతించిందని ప్రత్యారోపణలు చేశారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేసినప్పుడు స్వాతి మలివాల్ అక్కడికి వెళ్తే ఆమెను పోలీసులు ఈడ్చేశారని, కొట్టారని గుర్తు చేశారు.
కేజ్రీవాల్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
మలివాల్‌పై దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనలో కేజ్రీవాలే ప్రధాన నేరస్థుడని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా కేజ్రీవాల్ గూండా అని విమర్శించారు.