BJP | యోగి కేబినెట్ నుంచి వైదొలిగిన స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ ఓ కోబ్రా లాంటిదని, బీజేపీ పాము లాంటిదని, తాను మాత్రం ముంగీసనని అభివర్ణించారు. మరోవైపు అరెస్ట్ వారెంట్‌పై ఆయన ఘాటుగా స్పందించారు. 8 సంవత్సరాల క్రితం కేసులో ఇప్పుడు వారెంట్ చేశారని, అలాగే రాజీనామా చేసిన రెండో రోజే వారెంట్ వచ్చిందన్నారు. ఇదే కాదు… మరో డజన్ కేసులు తనపై బుక్ చేసినా, తన నైతిక స్థైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బ తీయలేరని స్పష్టం చేశారు. వారెంత ఇబ్బందులకు గురిచేస్తే, తానంత గట్టిపడతానని, వారిని ఓడించి తీరుతానని స్వామి మౌర్య పేర్కొన్నారు.
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను స్వామి మౌర్యపై 2014 లో ఓ కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఆయన బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కాలేదు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తాను తిరిగి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను స్వామి మౌర్య ఖండించారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై బీజేపీ దృష్టి నిలిపితే, ఈ పరిస్థితి దాపురించి ఉండేదే కాదన్నారు. తన రాజీనామా బీజేపీలో పెద్ద ప్రకంపనలనే రేపిందని పేర్కొన్నారు.