కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జైనగర్ ప్రాంతంలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడి ఉంటాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ వ్యక్తి రెండు రోజులుగా బాలికకు ఐస్‌క్రీమ్ ఇస్తూ ఆమెతో స్నేహం చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అతడే శుక్రవారం బాలికకు లిఫ్ట్ ఇచ్చి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడని తెలిపారు. శనివారం బాలిక మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మహిస్మరి పోలీస్ ఔట్‌పోస్ట్‌కు నిప్పు పెట్టారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. స్థానికులను శాంతింపజేసేందుకు వచ్చిన కుల్తలి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ మండల్‌ను స్థానికులు తరిమేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన హాస్పిటల్‌కు వచ్చిన తృణమూల్ ఎంపీ ప్రతిమ మండల్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు.