Gas Cylinder Blast | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నయ్యనపాళ్యా ఏరియాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక బాలుడు మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించారు.
అయితే ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కుప్పకూలింది. గోడలు ధ్వంసమయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద తీవ్రతను చూస్తుంటే.. ఇతర పేలుడు పదార్థాలు పేలుడుకు కారణమై ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు.
పోలీసులు మాత్రం గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందిన ప్రాథమికంగా నిర్ధారించారు. లోతుగా దర్యాప్తు జరిపి నిజనిజాలు వెల్లడిస్తామన్నారు. అయితే స్థానికులు ఉదయమే పనులకు వెళ్లడంతో చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. జనాలు నివాసాలకే పరిమితమై ఉంటే.. ప్రాణ నష్టం అధికంగా ఉండేదన్నారు. క్షతగాత్రులను కస్తురమ్మ(35), సరసమ్మ(50), షబీరాణా బాను(35), సుబ్రమణి(62), షేక్ నజీద్ ఉల్లాహ్(37), ఫాతిమా(8)గా గుర్తించారు. వీరందరిని సంజయ్ గాంధీ, జయనగర్ హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.