అయోధ్య, డిసెంబర్ 27: వచ్చే నెలలో ప్రారంభానికి అయోధ్యలోని రామమందిరం ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సూర్యుని ఇతివృత్తంతో రూపొందించిన 40 సూర్య స్తంభాలను గుడికి చేరుకునే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్నారు. 30 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్తంభాలపై అలంకారప్రాయంగా ఒక గోళాకారాన్ని ఉంచారు. రాత్రిపూట దీనిని వెలిగించినప్పుడు సూర్యుని పోలి ఉంటుంది. లతా మంగేష్కర్ చౌక్‌ను కలిపే థర్మపథ్లో అయోధ్య బైపాస్ సమీపంలోని నయాఘాట్ వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
అంతా రామమయం
అయోధ్య సర్వం రామమయంగా మారింది. వీధుల్లో ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తున్నది. దుకాణాల షట్టర్లు సైతం అయోధ్య రాముని పేరుతో పాటు స్వస్తిక్ గుర్తులతో నిండిపోయాయి. అయోధ్యకు దారితీసే 13 కిలోమీటర్ల పొడవైన సహదాత్గంజ్ నయాఘాట్ రోడ్లో రెండు వైపులా పెద్దయెత్తున దుకాణాలు ఉంటాయి.
రామాలయం ప్రారంభోత్సవానికి మమత దూరం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెల 22న జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పార్టీ తరపున ప్రతినిధిని పంపించే యోచన కూడా టీఎంసీకి లేదని తెలుస్తున్నది.