న్యూఢిల్లీ : ఫ్లోరిడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్) టీకాను అభివృద్ధి చేశారు. ఇది కణతులు (ట్యూమర్లు)పై శరీర రోగ నిరోధక వ్యవస్థ స్పందనను పెంచుతుంది. ఈ టీకాను ప్రామాణిక ఇమ్యునోథెరపీ ఔషధాలతో కలిపి ఎలుకలకు ఇచ్చినపుడు కణతులపై గట్టి ప్రభావం చూపింది. ఈ అధ్యయన నివేదికను ‘నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్’ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ టీకా పట్ల భరోసా ఎందుకంటే, ఇది నిర్దిష్ట ట్యూమర్ ప్రొటీన్స్‌ను లక్ష్యంగా చేసుకోదు. ఇది ఓ వైరస్‌తో పోరాడుతున్నట్లుగా, రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తుంది. కణతులలోని పీడీ-ఎల్1 అనే ప్రొటీన్ ఎక్స్ప్రెషన్ను బలోపేతం చేయడం ద్వారా ఈ ఫలితాన్ని సాధించారు. దీనివల్ల కణతులు చికిత్సకు మరింత ఎక్కువగా స్పందిస్తాయి. లీడ్ రిసెర్చర్ డాక్టర్ ఎలియాస్ సయౌర్ మాట్లాడుతూ, కేవలం శస్త్ర చికిత్స, రేడియేషన్ లేదా కీమోథెరపీపై మాత్రమే ఆధారపడకుండా, క్యాన్సర్‌కు చికిత్స చేసే నూతన మార్గానికి ఈ పరిశోధన దారి తీస్తుందన్నారు.