ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మతపరమైన నినాదాలు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశ ప్రజలందరికీ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రచారంలో కేవలం ఒక మతానికి అనుకూలంగా నినాదాలు చేస్తుండటం తనను ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని పవార్ చెప్పారు.
ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కలిగిన దేశంలో ప్రధాని తీరు మంచిది కాదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కచ్చితంగా ప్రజాస్వామిక, లౌకిక విలువలకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఇలాంటి నినాదాలు ప్రజల మధ్య చిచ్చు రేపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు. కాగా, కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 13న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.