Bihar | పాట్నా, సెప్టెంబర్ 8: బీహార్‌లోని సరన్‌లో అజిత్‌కుమార్ పురి అనే ఓ నకిలీ వైద్యుడు కృష్ణకుమార్ (15) అనే బాలుడి ప్రాణాలను హరించాడు. ఆ బాలుడి పిత్తాశయం నుంచి రాయిని తొలగించేందుకు సదరు ‘వైద్యుడు’ యూట్యూబ్‌లోని వీడియోలపై ఆధారపడి శస్త్రచికిత్స చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఈ ఆపరేషన్ వల్ల కృష్ణకుమార్ ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో ఆ నకిలీ వైద్యుడు ఓ అంబులెన్స్ ద్వారా అతడిని రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఓ దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో కృష్ణకుమార్ దారి మధ్యలోనే మరణించాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హాస్పిటల్ వద్ద వదిలేసి ఆ వైద్యునితోపాటు అతని వెంట ఉన్నవారు పరారయ్యారని వాపోయారు.
అంతకుముందు కృష్ణకుమార్‌కు పలుమార్లు వాంతులు కావడంతో సరన్‌లోని గణపతి హాస్పిటల్లో చేర్చామని, ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు ఆగిపోయినప్పటికీ కృష్ణకుమార్‌కు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పిన అజిత్‌కుమార్ పురి.. యూట్యూబ్‌లోని వీడియోలను చూస్తూ శస్త్రచికిత్స చేయడంతో తన కుమారుడు మృతి చెందాడని బాధితుడి తండ్రి చందన్ షా తెలిపారు. ఆ ‘డాక్టర్’ తనకు తానుగా వైద్యుడినని చెప్పుకుంటున్నట్టు అనిపిస్తున్నదని, ఆయనకు సరైన అర్హతలు ఉన్నాయో లేవో తమకు తెలియదని కృష్ణకుమార్ కుటుంబసభ్యులు చెప్పారు.