న్యూఢిల్లీ: వజ్రాలకు, వస్త్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న సూరత్ ఈసారి టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు సంబంధించిన రంగాల్లో వార్తల్లోకి ఎక్కింది. భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు శివమ్ మౌర్య, గురుప్రీత్ అరోరా, గణేశ్ పాటిల్ కలిసి ఏఐ ఆధారిత భవిష్యత్ బైక్ ‘గరుడ’ను అభివృద్ధి చేశారు. ఇందులో 50 శాతం మెటీరియల్ కోసం తుక్కును వినియోగించడం విశేషం. ఈ బైక్ తయారీకి మొత్తం రూ. 1.8 లక్షలు ఖర్చయింది.
వాహన రంగంలో టెస్లా అన్ని సరిహద్దులను చెరిపేసి తనకంటూ సరికొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డ్రైవర్‌లెస్ కార్లతో ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్నది. ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకున్న విద్యార్థులు ‘గరుడ’ బైక్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఏఐ బైక్ అయినప్పటికీ దీనికి డ్రైవర్ అవసరం. మున్ముందు దీనిని పూర్తి డ్రైవర్‌లెస్ బైక్‌గా తీర్చిదిద్దనున్నారు. వైఫైతోపాటు మెదడులా వ్యవహరించే కాంపాక్ట్ కంప్యూటర్ ‘రాస్ప్బెర్రీ పీఐ’ ఆధారిత కమాండ్లతో ఈ బైక్ పనిచేస్తుంది.
గరుడ బైక్‌లో సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో అత్యుత్తమ సెన్సార్లు బిగించారు. ఇవి రియల్‌టైమ్‌లో రోడ్లను అంచనా వేస్తాయి. 12 అడుగుల రేంజ్‌లోకి రాగానే బైక్ దానంతట అదే నెమ్మదిస్తుంది. మూడడుగుల దూరంలో ఏదైనా అడ్డంకి ఏర్పడితే బైకర్ బ్రేకులు వేయకుండానే ‘మూడడుగుల దూరంలో ఆగిపో’ అనే వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా బైక్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ ఏఐ ఫీచర్ వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు తగ్గుతుంది.
గరుడ బైక్ పూర్తిస్థాయి టచ్‌స్క్రీన్ ఇంటర్ ఫేస్ కలిగి ఉంది. ఇందులో జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాలింగ్, మ్యూజిక్ ప్లే బ్యాక్ వంటివి ఉన్నాయి. ముందు వెనక కెమెరాలను బిగించారు. వీటివల్ల అన్ని వైపుల ట్రాఫిక్‌ను స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే, వైర్లెస్ మొబైల్ చార్జింగ్ సిస్టంను కూడా అమర్చారు. ఈ బైక్‌పై ఎకోమోడ్‌లో 220 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో ఉపయోగించిన లిథియమ్ అయాన్ బ్యాటరీ రెండు గంటల్లోనే చార్జింగ్ అవుతుంది. ఈ బైక్‌ను రూపొందించేందుకు ఏడాది సమయం పట్టిందని విద్యార్థులు తెలిపారు.